Thursday, January 10, 2013

అక్బరుద్దీన్ వివాదాస్పద ప్రసంగం వీడియో - హై కోర్ట్ వ్యాఖ్యలు




దేశంలోని హిందువులను అక్బర్ అంతం చేస్తారా ?

జస్టిస్ ఎల్ నర్సింహడ్డి , ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి

నమస్తే తెలంగాణ వార్త (10-01-2013)
సేకరణ:వనం జ్వాలా నరసింహారావు

ముస్లింలందరూ ఇదే కోరుతున్నారని అనుకుంటున్నారా?; ఆయన కుటుంబానికి దేశం ఎంతో చేస్తే.. దేశంపై ఆయన విద్వేషం చూపుతారా?; ఎంఐఎం ఎమ్మెల్యేకు హైకోర్టు ఘాటు ప్రశ్నలు; దాడి జరిగితే అక్బర్‌ను కాపాడింది పోలీసులే; వారిని పక్కనపెడితే ప్రతాపం చూపిస్తారా?; మీకు రక్షణ ఇస్తున్నది వారేనని మరిచారా?; చర్యకు ప్రతి చర్య అన్నదాంట్లోనే సమాధానాన్ని గుర్తించలేదా?; అక్బర్ తరపు లాయర్‌ను నిలదీసిన న్యాయస్థానం; దేశంలో నమోదయ్యే కేసులపై హైకోర్టుకు ఎందుకు వచ్చారు?; ఇతర రాష్ట్రాల కేసుల్లో హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుంది?; ఎఫ్‌ఐఆర్‌ల నమోదులు ఆపాలన్న పిటిషన్ స్వీకరిస్తూ వ్యాఖ్యలు; ప్రతివాదులకు నోటీసులు.. విచారణ వాయిదా.

దేశాన్ని, ఒక మతాన్ని కించపరిచే విధంగా ప్రసంగాలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగాలపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన శాసనసభ్యుడి హోదాలో ఉండి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలను చేయడం ఏ మేరకు సబబని ప్రశ్నించింది. గంటో అరగంటో పోలీసులు రోడ్లపైకి రాకుండా ఉంటే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో తెలుసా? అని కోర్టు నిలదీసింది. పదిహేను నిమిషాలు సమయం ఇస్తే హిందువులను అంతం చేయాలని అక్బరుద్దీన్ అనుకుంటున్నారా? దేశంలోని ప్రతి ముస్లిం వ్యక్తి ఇదే అభివూపాయంతో ఉన్నారని ఆయన అనుకుంటున్నారా? అని ఘాటుగా ప్రశ్నించింది. నిజామాబాద్, నిర్మల్‌లో అక్బరుద్దీన్ చేసిన ప్రసంగాలపై దేశవ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్లు, కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలవుతుండటంపై అక్బరుద్దీన్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.

ఇదే అంశంపై ఇప్పటికే పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైనందున, మరిన్ని పోలీస్‌స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశాలు జారీచేయాలంటూ తన పిటిషన్‌లో కోరారు. దీనిపై బుధవారం జస్టిస్ ఎల్ నర్సింహడ్డి ఆధ్వర్యంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అక్బరుద్దీన్ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ డీవీ సీతారామమూర్తి వాదనలు చేపట్టారు. ఇప్పటికే నిజామాబాద్, నిర్మల్ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. మున్ముందు ఇదే ప్రసంగాలపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని అభ్యర్థించారు. దీనిపై న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ దేశవ్యాప్తంగా నమోదు అయ్యే కేసులపై హైకోర్టును ఆశ్రయించడం ఏమిటని వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాల్లో కేసుల నమోదు విషయంలో రాష్ట్ర హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని వివరణ అడిగారు. రాష్ట్ర హోంశాఖ తరఫు న్యాయవాది వాదనలు చేస్తూ ఢిల్లీలో సైతం అక్బరుద్దీన్‌పై కేసులు నమోదయ్యాయని తెలిపారు.


విచారణ సమయంలో అక్బరుద్దీన్ తరపు న్యాయవాదిని ఉద్దేశించి జస్టిస్ ఎల్ నర్సింహడ్డి ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. అక్బరుద్దీన్ ప్రసంగాలను యూ ట్యూబ్‌లో వీక్షించామని న్యాయమూర్తి అన్నారు. ప్రసంగంలో అక్బరుద్దీన్ దిగజారి మాట్లాడారని కోర్టు వ్యాఖ్యానించింది. దేశాన్ని ‘అరే హిందుస్థాన్..’ అంటూ ప్రసంగించడం ఏ విలువలకు నిదర్శనమని కోర్టు ప్రశ్నించింది. ‘ఆయన తండ్రి సలావుద్దీన్ ఒవైసీని, సోదరుడు అసదుద్దీన్‌ను పలుమార్లు ఎంపీగా ఎన్నుకున్నారు. అక్బర్‌ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అలాంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉండి దేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానించడమేమిటి? ఇదేనా దేశానికి ఇస్తున్న గౌరవం?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు.

‘అక్బరుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఎంఐఎం తరఫున హైదరాబాద్‌కు మొదటి మేయర్‌గా ఆలంపల్లి పోచయ్య, రెండవ మేయర్‌గా సత్యనారాయణను చేశారు కదా? అలాంటి కుటుంబంలోని వ్యక్తి ఒక వర్గంపై విద్వేష వ్యాఖ్యలు చేయడమేమిటి?’ అని నిలదీశారు. రాముని తల్లి కౌసల్యను ఉద్దేశించి అక్బర్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని అన్నారు. కౌసల్య ఎక్కడెక్కడ తిరిగి రామునికి జన్మనిచ్చావు? (కౌసల్య.. కహా కహా ఫిర్‌కే రామ్‌కో జన్మ్ దియా?) అని చేసిన ప్రసంగాలు ఏమిటన్నారు? ఒక రాముని తల్లిని ఉద్దేశించి వ్యాఖ్యలను చేసిన వ్యక్తి తరపున మరో సీతారాముడు కేసు వాదనలు చేయడం ఆల్‌మైటీకి నిదర్శనమన్నారు. (అక్బరుద్దీన్ తరపున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది రామచంద్ర రాజు కాగా, వాదనలు వినిపించేందుకు వచ్చిన న్యాయవాది పేరు సీతారామమూర్తి. సీతారామమూర్తిని ఉద్దేశించి న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యానించింది) ప్రసంగంలో ఒక చోట దేశంలో చార్మినార్, కుతుబ్ మీనార్, తాజ్‌మహల్‌ను తీసుకెళ్లితే హిందుస్థాన్‌లో ఇంకేం మిగులుతుంది? కూలిపోయిన (టూటే పూటే రామ్‌కీ మందిర్) రాముని ఆలయాలు తప్పితే అనడం దేనికి ఔచిత్యమని కోర్టు ప్రశ్నించింది.

‘పోలీసులను 15 నిమిషాలపాటు పక్కనపెడితే మరో వర్గాన్ని అంతం చేస్తామని అన్నారు కదా? మరి అక్బరుద్దీన్ సైతం పోలీసులు రక్షణలో ఉన్నారని మరిచారా? గతంలో ఆయనపై దాడులు జరిగిన సమయంలో పోలీసులే ఆయనను రక్షించారనే విషయాన్ని మరిచారా? గతంలో ఆయనపై దాడులు జరిగి ఆస్పత్రి పాలైన సమయంలో పార్టీలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చేశారు కదా?’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ‘అక్బరుద్దీన్ ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని విన్నాను. అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరినీ అంతమొందించాలని అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. మతసామరస్యానికి ప్రతీకలుగా తన అనుభవంలోకి వచ్చిన కొన్ని ఉదాహరణలు చెబుతూ ‘గతంలో గుంటూరులో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్షికమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన సమయంలో దాశరథి శతకం వ్యాఖ్య పోటీల్లో ఒక ముస్లిం అమ్మాయి మొదటి బహుమతిని గెలిచింది. అయితే మొదటి బహుమతిగా నిర్వాహకులు రాముని ఫోటోను తెచ్చారు. 

ముస్లిం యువతి కావడంతో బహుమతిగా వేరే వస్తువును తీసుకోవాలని నిర్వాహకులు చెప్పారు. కానీ అమ్మాయి, అమ్మాయి తల్లి ఇద్దరు సైతం ముస్లింలు అయినప్పటికీ, రాముని ఫోటోనే బహుమతిగా కావాలని చెప్పారు’ అని తెలిపారు. అలాంటి మతసామరస్యం గల ఈ దేశంలో అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేయడమేమిటన్నారు. ఇంకో కార్యకమంలో సాగర సంగమం సినిమాలోని ఓం నమశ్శివాయః పాటకు వాహెద్ అనే కుర్రాడు అద్భుతమైన సంగీతాన్ని లైవ్‌గా ఇస్తూంటే తనకే ఆశ్చర్యం వేసిందని జస్టిస్ ఎల్ నర్సింహడ్డి అన్నారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్‌లాంటి మహనుభావులు ఉన్న దేశంలో, దేశంపై, ఒక వర్గంపై విద్వేష వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అక్బరుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

(నమస్తే తెలంగాణ దిన పత్రికలో వచ్చిన వార్త యధాతధంగా బ్లాగ్ రీడర్స్ సౌకర్యం కొరకు పొందుపరుస్తున్నానిక్కడ-వనం జ్వాలా నరసింహారావు)(కర్టెసీ :http://jwalasmusings.blogspot.in)

No comments:

Post a Comment